
- దీనికి కాలమే సమాధానం చెప్తుంది: జగ్గారెడ్డి
- నాకు సినిమా ఆఫర్ వచ్చింది..ఇటీవలే ఓ కథ విన్నా
- సినిమా పేరు ‘జగ్గారెడ్డి...వార్ ఆఫ్ లవ్’ అని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక లిస్ట్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నానని చెప్పారు. దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర ముఖ్య నేతల దగ్గరకు సమస్యను తీసుకెళ్తే.. ఒకరు పెద్దగా నవ్వుతారని, మరొకరు తలూపుతారని, ఇంకో నేత మౌనంగా ఉంటారని అన్నారు. ఆ హావాభావాలకు అసలు అర్థమేంటో ఇప్పటికీ తనకు తెలియడం లేదని కామెంట్ చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన జగ్గారెడ్డి సోమవారం ఇక్కడి తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు.
కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడు జట్టి కుసుమ్కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని తాను పార్టీని కోరినట్టు వెల్లడించారు. ఈ అంశంపై పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. 2017 లో రాహుల్ గాంధీ సంగారెడ్డి సభ ఏర్పాట్లను తానే దగ్గరుండి పర్యవేక్షించానని గుర్తు చేశారు. నాటి కష్టాలు, పరిణామాలను అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి చెప్పాలని ఢిల్లీకి వచ్చినట్టు తెలిపారు.
రాహుల్ గాంధీని సమయం అడిగానని, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే కలిసి అన్ని అంశాలు మాట్లాడుతానని చెప్పారు. కాగా, త్వరలో వెండి తెరపై తాను ఓ కీ రోల్ లోకనిపించబోతున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. ఈ సినిమాలో మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెండ్లి చేసే క్యారెక్టర్ చేయబోతున్నానని వెల్లడించారు. ‘జగ్గారెడ్డి...వార్ ఆఫ్ లవ్’ పేరుతో తీయబోయే ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాదికి పూర్తికానుందని చెప్పారు.